అమెరికా వలస విధానాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐటీ నిపుణుల్లో కలకలం రేపుతున్నాయి. అమెరికాలోకి వలసలను పదేళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థ, శరణార్థుల కార్యక్రమాలు పూర్తిగా అవినీతిమయం అయ్యాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాలపై స్పందిస్తూ.. అమెరికన్ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీ కార్మికులతో భర్తీ చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం వీసా ఫీజులను ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం, వర్క్ పర్మిట్ల కాలవ్యవధిని కుదించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో బానన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రతిపాదనలు గనుక అమలైతే, అమెరికా వెళ్లాలనుకునే భారతీయ టెక్కీలకు రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.