సంక్రాంతి నేపథ్యంలో హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణ చర్యలపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

Spread the love

మరికొద్ది రోజుల్లోనే  సంక్రాంతి సందడి మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేలు తమ సొంతూళ్లకు వెళ్లే వారితో రద్దీగా కిటకిటలాడుతుంటాయి. ఇక ఈ ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఇదివరకటి  అనుభవాల దృష్ట్యా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 

హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి ట్రాఫిక్  ఎక్కువగా ఉంటుంది. రోజుకు సుమారు లక్ష వాహనాలు ఆ మార్గంలో వెళ్తాయి. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాఫిక్ జామ్ కావడానికి వీల్లేదని పండగ రద్దీ ఉన్నన్ని రోజులూ రోడ్లు మూసేయొద్దని సూచించారు.  భారీ యంత్రాలతో పనులు చేపట్టవద్దని  అత్యవసరమైనవి అయితే ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలన్నారు. రోడ్లపై మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. 

రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోటా పగలు, రాత్రి స్పష్టంగా కనిపించేలా ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా చూపాలని ఎక్కడా ట్రాఫిక్కు అయోమయం కలిగించేలా ఏర్పాట్లు ఉండకూడదని పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలన్నారు.  ట్రాఫిక్ రద్దీ, ప్రజల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు వివరించారు.