బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలైన హిందువులపై జరుగునున్న దాడులను యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ఖండించింది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ హిందువులపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాలో చోటుచేసుకున్న దీపూ చంద్రదాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్ల హత్యలను ఆయన ఖండించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. దీపూ చంద్ర దాస్ హత్య కేసులో బంగ్లాదేశ్ పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేయడాన్నితదితర చర్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల మత స్వేచ్ఛ, విశ్వాసాలను కాపాడటానికి యూకే ప్రభుత్వం కట్టుబడి ఉందని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. నవంబర్ లో తమ మంత్రి జెన్నీ చాప్మన్.. బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత యూనస్ ను కలిసిన సమయంలో కూడా బంగ్లాలో మైనారిటీల రక్షణ అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. పౌర, మానవ హక్కులను రక్షించడంలో.. అవినీతిని ఎదుర్కోవడంలో బంగ్లాదేశకు బ్రిటన్ మద్దతు కొనసాగిస్తుందని తెలిపారు. బంగ్లాదేశ్ రాజకీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో తరచుగా హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.