లోక్ సభలో దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతుంటే ప్రభుత్వం అనుమతించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో నేడు అధికార, విపక్షాల మధ్య ఈ అంశంపై వాగ్వాదం జరిగింది. భారత సరిహద్దుల్లో చైనా ఆర్మీ చొరబడుతుందనేది తాను చెప్పిన మాటలు కావని అది స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన బుక్ లో రాశారని ఈ విషయం బయటకు వస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని భయపడి దాని పబ్లిషింగ్ ను కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. లోక్ సభ వాయిదా పడిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఆ బుక్ పబ్లిష్ అయితే మన సైన్యాన్ని ప్రభుత్వం ఎలా నిరాశపరిచిందో ప్రజలు తెలుసుకుంటారని రాహుల్ అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విషయాలు చెబుతాననే భయంతో తనను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. రాహుల్ ను మాట్లాడించాల్సిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.