ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బీజేపీ అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. స్వయంగా సీఎంగా ఉన్న మమతా బెనర్జీనే తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ లో బీజేపీ 207 స్థానాల్లో ఘన విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ 80, కాంగ్రెస్ 2, ఏ.జె.యూ.పీ 2, కమ్మూనిస్టు పార్టీలు 1, ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ 1 స్థానాలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమత బెనర్జీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి దానిని రద్దు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈరోజు బెంగాల్ సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణం చేశారు. దీంతో మమతా బెనర్జీ పట్టువీడినట్లే కనిపిస్తోంది. తన పరాజయాన్ని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆమె తన ఎక్స్ బయోను అప్డేట్ చేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ సీఎం (15, 16, 17వ విధానసభ)’ అని మార్చుకున్నారు. అంతకుముందు ‘పశ్చిమ బెంగాల్ సీఎం’ అని మాత్రమే ఉండేది. దీనిని ఓటమిని అంగీకరిస్తున్నట్లే నెటిజన్లు భావిస్తున్నారు.