పశ్చిమ బెంగాల్ సీఎంగా ఈరోజు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సువేందు అధికారి కి అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించడం కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడి, దృఢంగా నిలిచిన పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకత్వానికి మరియు పార్టీ కార్యకర్తలకు కూడా పవన్ అభినందనలు తెలిపారు. నూతన ప్రభుత్వం పారదర్శకమైన మరియు ప్రజాహిత పాలనను అందించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయం కేవలం బీజేపీ లేదా పశ్చిమ బెంగాల్ విజయం మాత్రమే కాదు, ఇది భారత ప్రజల విజయం అని తాను భావిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్లో హింస, అరాచకం, అక్రమ చొరబాటు మరియు తీవ్రవాద ముప్పులు పెరిగిపోవడం సామాజిక సామరస్యానికి, జాతీయ భద్రతకు తీవ్ర సవాళ్లుగా మారాయని ఇటువంటి కీలక సమయంలో, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి మరియు బలమైన పాలనతో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ తీర్పు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు మరియు దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమానికి సైద్ధాంతిక పునాది వేసిన దూరదృష్టి గల నాయకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీని ఈ సందర్భంగా స్మరించుకున్నా పవన్ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన జన్మస్థలమైన పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఈ విజయం, ఆయన ఆశయాలకు మరియు సిద్ధాంతాలకు దక్కిన నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అలాగే ఈ విజయం ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సహా ఈ అద్భుత విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు పవన్ తన అభినందనలు తెలిపారు.