కేవలం ఒక్క ఓటుతోనే చరిత్ర మారిపోయింది..!

Spread the love

ఒక్క ఓటే కదా ఏముందిలే అనుకునే వారికి ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక ఉదాహరణ కనువిప్పు కలిగిస్తుంది. ఓటు కోసం సెలవిచ్చినా కూడా కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాకుండా అదొక హాలీడేగా ఎంజాయ్ చేసిన ఘటనలు మనకు తెలిసిందే. అయితే ఒక ఓటు విలువ ఎంత విలువైనదో చెప్పే ఉదంతం ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో జరిగింది. కేవలం ఒక్క ఓటుతో ఒక అభ్యర్థి గెలుపొందడం చర్చనీయాంశమై వార్తల్లో నిలిచింది. తిరుపత్తూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులలో ఒకరికి 83374 ఓట్లు రాగా మరో అభ్యర్థికి 83375 ఓట్లు వచ్చాయి. అంటే ఒక్క ఓటు తేడాతో విజయం ఒకరిని వరించింది. మరొకరు రెండో స్థానానికే పరిమితమయ్యారు. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా తనదైన శైలిలో స్పందించారు. ఈ ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏ కోణంలో చూసినా అత్యంత నాటకీయంగా ఉన్నాయి. కానీ నాకైతే, ఈ ఎన్నికల ఫలితాల్లో ఈ చిత్రం ఎప్పటికీ మర్చిపోలేనిదిగా నిలిచిపోతుంది. తమిళనాడులోని ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య 166,000 కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అయితే చరిత్ర మాత్రం కేవలం ఒక్క ఓటుతోనే మారిపోయింది. ఈ చిత్రాన్ని మన దేశంలోని ప్రతి పాఠశాలలోనూ, బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలోనూ చూపించాలి. తద్వారా ప్రతి బిడ్డకు అర్థం కావాల్సింది ఏమిటంటే—వారు పెరిగి పెద్దయ్యాక, వారి దగ్గర ఉండబోయే అత్యంత గొప్ప శక్తి ‘ఒకటి’ ఇచ్చే శక్తి అని అదే వారి ఒక్క ఓటు శక్తి అని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *