పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్ కతాలో ఈరోజు జరిగిన బీజేపీ కొత్త ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన్ను ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో బెంగాల్ కు మొట్ట మొదటి బీజేపీ సీఎంగా సువేందు అధికారి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ స్థానం నుండి కూడా విజయం సాధించారు. ముఖ్యంగా భవానీపూర్‌లో టీఎంసీ అధినేత, మాజీ సీఎం మమతా బెనర్జీని 15 వేలకు పైగా మెజారిటీతో ఓడించి రెండో సారి ఈ ఘనత అందుకున్నారు. గత ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీని ఆయన ఓడించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిరస్మరణీయ విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికిన సంగతి విదితమే. మొత్తం 294 స్థానాలలో కాషాయ దళం 207 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. దీంతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నిక కోసం కోల్ కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ సహ పరిశీలకునిగా వ్యవహరించారు. రేపు కోల్‌కతాలోని ప్రసిద్ధ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో సువేందు అధికారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సువేందు అధికారి ఎన్నికతో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.