కోనసీమ జిల్లా ఇరుసుమండలో చోటుచేసుకున్న భారీ బ్లో అవుట్ ప్రమాదం ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఈ మంటలను ONGC అధికారులు తమ నిరంతర కృషితో పూర్తిగా నిలిపివేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, మంటలను కంట్రోల్ చేయడమే కాకుండా విజయవంతంగా వెల్ క్యాప్‌ను బిగించారు. గ్యాస్ లీకేజీని అరికట్టడంతో అటు యంత్రాంగం, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో ఉన్న ఇనుప శకలాలను, ఇతర వ్యర్థాలను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘటనా స్థలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఇరుసుమండ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో ఒక పెద్దప్రమాదం తప్పినట్లు భావించవచ్చు.