సోషల్ మీడియాను వినియోగించే అంశంలో వయసుల వారీగా పరిమితులు విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమేరకు ఆయా సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వలన కలిగే దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా తదితర దేశాలు చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం డీప్ ఫేక్, ఏజ్ బేస్డ్ రిస్ట్రిక్షన్స్ పై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అనేక దేశాలు ఏజ్ బేస్డ్ రిస్ట్రిక్షన్స్ ను అంగీకరించాయి. భారత్ లో కూడా ఇది అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వాడకంలో వయసు పరిమితులు మరియు డీప్‌ఫేక్ నియంత్రణపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు.గత వారం కూడా కేంద్ర ప్రభుత్వం ఏఐ కంటెంట్‌ను తప్పనిసరిగా లేబుల్ చేయాలని, అభ్యంతరకర కంటెంట్‌ను 3 గంటల్లోగా తొలగించాలని ఐటీ నిబంధనలను సవరించింది.