వర్షం కారణంగా ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ రద్దు.. ఆస్ట్రేలియా ఔట్

Spread the love

టీ 20 వరల్డ్ కప్ 2026లో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3.00 గంలకు ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో  ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఐర్లాండ్, జింబాబ్వేలకు చెరొక పాయింట్ వచ్చింది. ఈ సమీకరణంతో  ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ బీలో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్ ఉన్నాయి. మూడు మ్యాచులకు మూడింట్లోనే పరాజయం పాలైన ఒమన్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంక సూపర్ 8కి అర్హత సాధించింది. దాని ఖాతాలో 6 పాయింట్లున్నాయి. తాజాగా ఐర్లాండ్ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వే ఖాతాలోకి ఒక పాయింట్ వచ్చింది. దీంతో ఆ జట్టు 5 పాయింట్లతో సూపర్ 8కు క్వాలిఫై అయింది. గ్రూప్ బీ నుండి ఆస్ట్రేలియా, ఐర్లాండ్ టోర్నీ నుండి  నిష్క్రమించాయి. ఫిబ్రవరి 20న  ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో ఆస్ట్రేలియా గెలిచినా దాని ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉంటాయి. దీంతో అది ఆ జట్టుకు సంబంధించి నామమాత్రపు మ్యాచే. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్… గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్… గ్రూప్ డీ నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ 8కు క్వాలిఫై అయ్యాయి. తాజాగా గ్రూప్ బీ నుంచి శ్రీలంకతోపాటు జింబాబ్వే సూపర్ 8కి చేరింది. గ్రూప్ ఏలో మరో స్లాట్ భర్తీ కావాల్సిఉంది. ఆ స్థానం కోసం పాకిస్థాన్, యూఎస్ఏ మధ్య పోటీ ఉంది.