వచ్చే ఏడాది (2026) జనవరి 26న న్యూ-ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతులో ఓ వినూత్నమైన బృందం (Contingent) సందడి చేయనుంది. భారత సైన్యంలోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (RVC) విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈసారి కవాతులో ప్రదర్శించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ముఖ్యంగా దేశ సరిహద్దుల్లోని కఠినమైన వాతావరణంలో సైనికులకు తోడుగా నిలిచే బాక్ట్రియన్ జాతికి చెందిన రెండు ఒంటెలు, నాలుగు గుర్రాలు, మరియు ఆకాశం నుండి శత్రువుల కదలికలను కనిపెట్టే నాలుగు డేగలు ఈ బృందంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.వీటితో పాటు స్వదేశీ జాతికి చెందిన పది ఆర్మీ జాగిలాలు, ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు జాగిలాలు కలిసి మొత్తం 16 కుక్కలు ఈ పరేడ్‌లో తమ క్రమశిక్షణను చాటనున్నాయి.లడఖ్ వంటి ఎత్తైన శీతల ఎడారి ప్రాంతాల్లో రవాణాకు ఉపయోగపడే రెండు మూపురాల (Bactrian) ఒంటెలు గణతంత్ర కవాతులో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం.సైనిక అవసరాల కోసం మూగజీవాలు అందిస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించి, వాటి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జంతువుల సంరక్షణ మరియు శిక్షణలో మన దేశం సాధించిన ప్రగతిని ఈ ప్రదర్శన ప్రతిబింబించనుంది.