లోక్ సభలో అధికార,విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. చైనా ఆర్మీ భారత బోర్డర్ లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించిందని ఆ వివరాలను రాహుల్ లోక్ సభలో ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ గాంధీ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని.. ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్ నాథ్ ప్రశ్నించారు.
సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మీడియా క్లిప్పింగులు, పబ్లిష్ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్ సభలో ప్రస్తావించకూడదని రూల్ బుక్ నియమాలను చదివి వినిపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై, ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడాలని రాహుల్ కు సూచించారు. మరోవైపు రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో లోక్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.