కర్ణాటకలోని బళ్లారి నగరంలో రాజకీయ ఆధిపత్య పోరు తీవ్ర రక్తపాతానికి దారితీసింది. వాల్మీకి విగ్రహావిష్కరణ బ్యానర్ ఏర్పాటు విషయంలో గంగావతి ఎమ్మెల్యే, కేఆర్‌పీపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ,కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారుల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసింది.హవాంబవి ప్రాంతంలోని జనార్దన్ రెడ్డి నివాసం ముందు జరిగిన ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ (28) బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, బాష్పవాయువును ప్రయోగించారు.ఉద్రిక్తతల దృష్ట్యా నగరంలో 144 సెక్షన్ విధించి భారీగా బలగాలను మోహరించారు.
ఈ ఘటనపై ఇరుపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను చంపేందుకు కుట్ర పన్నారని, తన ఇంటిపై కాల్పులు జరిపారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించగా.. జనార్దన్ రెడ్డే తమ కార్యకర్తను పొట్టనబెట్టుకున్నారని భరత్ రెడ్డి మండిపడ్డారు.జనార్దన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.రాజశేఖర్ మృతికి కారణమైన బుల్లెట్ ఎవరి తుపాకీ నుండి వచ్చిందనే అంశంపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ పవన్ నెజ్జూర్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటనతో బళ్లారిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.