ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో జరగబోయే సిడ్నీ టెస్ట్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తన కెరీర్లో తాను ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి మాట్లాడాడు. ‘నేను ఎప్పుడూ కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా. నేను నల్లజాతి క్రికెటర్ను. ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడలేను అని నన్ను అన్నారు. కానీ నేను సాధించాను. అది నాకు గర్వకారణం. ఆనందదాయకం. అయితే జట్టులోని పలువురు సభ్యులు, మీడియా వారు నాతో వివక్షపూరితంగా వ్యవహరించారు. క్రికెట్ పై నాకున్న అంకితభావం, నిబద్ధతను శంకించారు. నా సన్నద్ధతను ప్రశ్నించారు’ అని ఉస్మాన్ ఖవాజా ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఇతర క్రికెటర్లు వ్యవహరించిన తీరును కూడా చెప్పి వాపోయాడు. పాకిస్థాన్ లో పుట్టిన ఉస్మాన్ ఖవాజా.. ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మొదటి ముస్లిం క్రికెటర్ అయ్యాడు. 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఉస్మాన్ ఖవాజా ప్రస్తుత యాషెస్ సిరీస్ లో మెల్బోర్న్ టెస్ట్లో 82 పరుగులు చేశాడు. ఖవాజా తన కెరీర్లో ఇప్పటివరకు 87 టెస్ట్లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. మొత్తంగా 8,001 అంతర్జాతీయ పరుగులు చేశాడు.