దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దాదాపు 9 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టూడెంట్స్ ను బయటకు పంపించేశారు. 2001లో పార్లమెంట్ పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురుకు గుర్తుగా ఢిల్లీ, పంజాబ్ లు ఖలిస్తానీగా మారతాయని స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈనెల 13న పార్లమెంటులో కూడా పేలుళ్లకు పాల్పడనున్నట్లు అందులో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా స్కూల్స్ కు వెళ్లి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్కూల్స్ ఆవరణలో ఎటువంటి అనుమానిత పేలుడు పదార్దాలు లభించలేదని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేయనున్నారు.