మోహన్ భగవత్ వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న కంగనా 

Spread the love

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వీర్ సావర్కర్‌ కు భారతరత్న ఇవ్వాలన్న ఆర్.ఎస్.ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. వీర్ సావర్కర్‌ కు దేశ అత్యున్నత పురస్కారం లభించాలని ఆమె అన్నారు. దేశానికి సావర్కర్ చేసిన సేవలను కొనియాడారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. సావర్కర్ అంశంపై  మోహన్ భగవత్ వ్యక్తపరిచిన అభిప్రాయం ప్రతి భారతీయుడి మదిలో ఉందని పేర్కొన్నారు. సావర్కర్‌కు భారతరత్న లభిస్తే అది ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. మరికొందరు నేతల నుండి కూడా ఈ అంశానికి సంబంధించి మద్దతు పెరుగుతోంది. బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు మదన్ రాథోడ్ కూడా మోహన్ భగవత్ వ్యాఖ్యలను సమర్ధించారు.  భారతదేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం ఎన్నో కష్టాలను ఓర్చిన దేశభక్తుడు, విప్లవకారుడు సావర్కర్ అని కొనియాడారు. ఆయన కాలాపానీ జైల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాడని గుర్తు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోరాటం చేశారని తెలిపారు. అలాంటి గొప్ప దేశభక్తుడికి భారతరత్న ఇవ్వాలన్నారు.బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ మాట్లాడుతూ, సావర్కర్ తన కంటే తన దేశాన్ని ఎక్కువగా ప్రేమించారని, భారతరత్నకు ఆయన అర్హుడని అన్నారు. ముంబైలో జరిగిన ఆరెస్సెస్ శతాబ్ధి ఉత్సవాల కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తే దాని ప్రతిష్ఠ పెరుగుతుందని వ్యాఖ్యానించారు.