గోవా షిప్ యార్డ్ లో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సముద్ర ప్రతాప్ షిప్ ను నేడు జలప్రవేశం చేయించారు. ఇప్పటికే దీనిని ఇండియన్ కోస్టార్డ్ కు అప్పగించిన విషయం తెలిసిందే. పొల్యూషన్ కంట్రోల్ కు ఉపయోగపడేలా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ షిప్ ను నిర్మించింది. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని.. ముఖ్యంగా ఆయిల్ వ్యర్థాలను నిర్మూలించి సముద్ర జీవులను కాపాడేందుకు దోహదపడే అధునాతన టెక్నాలజీ ఇందులో ఉంది. ఈ నౌక మన సంకల్పానికి నిదర్శనమని సాగరాల్లో కాలుష్య నియంత్రణపై దృష్టి కేంద్రీకరించి దీనిని తీర్చిదిద్దారని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. దీంతోపాటు తీర గస్తీ, సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇందులో 60 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను వినియోగించినట్లు తెలిపారు. దేశ స్వావలంబన దిశగా ఇదొక కీలక ముందడుగని ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. సముద్రంలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, భారతీయ కోస్ట్ గార్డ్ అందరికంటే ముందుగా సహాయం అందిస్తుంది. ఈ కారణంగానే నేడు భారతీయ కోస్ట్ గార్డ్‌ను ఎంతో గౌరవంగా చూస్తారని పేర్కొన్నారు.