మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు భారీగా పోటెత్తిన భక్తులు

Spread the love

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలి రావడంతో సందడిగా మారింది. ప్రయోగరాజ్ పరిసరాలన్నీ భారీ జనసందోహంతో కిటకిటలాడాయి. త్రివేణి సంగమం వద్ద వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపుగా 4.52 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. మాఘ మేళా 2025-26 పవిత్ర స్నానాల కోసం 12,100 అడుగుల పొడవైన ఘాట్ లను నిర్మించామని భక్తులకు అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సాధారణ, ట్రాఫిక్ పోలీసులతో పాటు ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో అవసరమైతే ట్రీట్మెంట్ చేసేందుకు మెడికల్ టీమ్ లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మాఘ మాసంలో వచ్చే అమావాస్యను ‘మౌని అమావాస్య’ అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగా ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తులు రోజంతా మౌన వ్రతాన్ని ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, వాక్శుద్ధి కలుగుతుందని నమ్ముతారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, మౌని అమావాస్య రోజున గంగా నది వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుందని, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ లో ఈ రోజున చేసే  స్నానం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.