కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని సంచలన ఆరోపణలు చేశారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును తాకట్టు పెట్టిందని పేర్కొన్నారు. డేటా, వ్యవసాయ, ఇంధన రంగం గురించి మాట్లాడారు. రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకే మేలు కలిగించేలా ఉందని భారత్ కు దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. రాహుల్ తన ప్రసంగంలో వాణిజ్య ఒప్పందంతో పాటు ఏఐ ప్రభావం వంటి అంశాల పైనా మాట్లాడారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలకు తగినట్లుగా బడ్జెట్ ఏమాత్రం ప్రతిబింబించలేదన్నారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తందని చెబుతున్నారు. దీంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలకు ప్రమాదం ఉంది. మన దేశానికి టాలెంట్ ఉన్న యువతరం పెద్ద ఆస్తి అని పేర్కొన్నారు. మన దేశం ఏ దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలో అమెరికా చెబుతోంది. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే 50 శాతం టారిఫ్ లు విధిస్తామని బెదిరిస్తున్నారు. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ ద్వారాలు తెరిచిందని ఆరోపించారు. అమెరికా దిగుమతులను 46 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచేశారు. భారత్ ఈ ఒప్పందం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. డాలర్ ను రక్షించుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతోందని రాహుల్ పేర్కొన్నారు.బడ్జెట్ పై ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో సంచలనం రేపిన ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తావన తీసుకురావడం దుమారం రేపింది. స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరీ పేర్లను ప్రస్తావించడంపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. బడ్జెట్ గురించి మాత్రమే మాట్లాడాలని స్పీకర్ సూచించారు.రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో అధికారపక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.