గిగ్ వర్కర్లకు  సామాజిక భద్రత కల్పనకు సంబంధించి ముసాయిదా నిబంధనలు విడుదల

Spread the love

మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో గిగ్ వర్కర్లు గత నెల రెండుసార్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లకు  సామాజిక భద్రత కల్పనకు సంబంధించి ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రయోజనాలు పొందాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో గిగ్ వర్కర్లు ఒక అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు.. ఒకటి కంటే ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద 120 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఒకరోజు అగ్రిగేటర్ వద్ద పనిచేస్తే.. వచ్చిన ఆదాయంతో సంబంధం లేకుండా దానిని ఒకరోజు కింద పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఒక గిగ్ వర్కర్ ఒకే రోజు ముగ్గురు అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తే.. దానిని మూడు రోజులుగా పరిగణిస్తారు. అలాగే నేరుగా లేక పరోక్షంగా అగ్రిగేటర్ తో కలిసి పనిచేసే వారిని గిగ్ వర్కర్ గా గుర్తించనున్నట్లు కేంద్రం తెలిపింది. అసంఘటిత కార్మికులకు నేషనల్ డేటాబేస్ గా పరిగణిస్తున్న ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతాయని వివరించింది. కార్మికశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇందులో రిజిస్టర్  చేసుకున్నవారికి ఫొటోగ్రాఫ్, ఇతర వివరాలతో కూడిన ఐడీ కార్డు జారీ చేస్తారు. ఎప్పటికప్పుడు తమ వివరాలను ఇందులో అప్డేట్ చేసుకోవాలి. ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ముసాయిదాను డిసెంబర్ 30నే ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.