విజయ్ ప్రమాణస్వీకారానికి రాహుల్!

Spread the love

ఐదు దశాబ్దాలుగా డీఎంకే , ఏఐఏడీఎంకే అనే రెండు ద్రావిడ పార్టీల మధ్యే ఉన్న అధికార పీఠాన్ని మూడో ప్రత్యామ్నాయం అధిరోహించబోతోంది.  పెద్దగా అంచనాలు లేకుండా తమిళ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు దళపతి విజయ్. తమిళగ వెట్రి కళగం పార్టీతో ఎన్నికల బరిలో నిలిచి అతిపెద్ద పార్టీగా తన పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తమిళనాట సినిమా హీరోలు పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయిలో కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కూడా తడబడ్డారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ నుండి వెనక్కి తగ్గారు. అయితే విజయ్ మాత్రం పక్కాగా క్యాచ్ చేశారు. తన అభిమాన సంఘాలను బూత్ లెవల్ వర్కర్స్ గా మార్చి.. దశాబ్దాలుగా  పాతుకుపోయిన ద్రావిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి రికార్డు సృష్టించారు.  కుల, మత సమీకరణాలను పక్కనపెట్టి యువత అంతా ఏకతాటిపైకి వచ్చి విజయ్ ని తమ నాయకుడిగా ఎన్నుకోవడంతో ఈరోజు ఆయన సీఎం పీఠానికి చేరువయ్యారు. చెన్నైలోని నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో తమిళనాడు 14వ సీఎంగా  ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ హాజరు కానున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈమేరకు రాహుల్ గాంధీకి విజయ్ నుండి స్పెషల్ ఇన్విటేషన్ అందినట్లు  సమాచారం. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ…ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే   118 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే పార్టీకి సొంతంగా 108 సీట్లు గెలుచుకుంది.  మిగతా 10 సీట్లను ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకున్నారు. అందులో భాగంగా ఐదుగురు  ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. తమిళనాడులో బీజేపీకి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకోవడంలో డీఎంకే ఇప్పటివరకు సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని విజయ్ ఆక్రమించారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న జాతీయ కూటములకు  తాను ఒక బలమైన సపోర్టర్ గా  ఉండబోతున్నానని విజయ్ ఒక నిశబ్ద సందేశాన్ని పంపినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ లాంటి జాతీయ నేత విజయ్ ప్రమాణ స్వీకారానికి వస్తే జాతీయ మీడియా ఫోకస్ మొత్తం చెన్నై వైపు తిరుగుతుంది. దీంతో విజయ్ పార్టీకి రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో మరింత గొప్ప ఇమేజ్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *