భారత్ అమెరికాకు కీలక భాగస్వామి:సెర్గియో గోర్

Spread the love

టారిఫ్ ల పెంపు తదితర అంశాల నేపథ్యంలో భారత్-అమెరికాల ప్రస్తుతం నెలకొన్న సంబంధాల గురించి సర్వత్రా తెలిసిందే.  ఇక తాజాగా భారత్ కంటే కీలక భాగస్వామి తమకు ఎవరూ లేరని మన దేశంలో అమెరికా కొత్త అంబాసిడర్ గా  నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. రెండు  దేశాల మధ్య సంబంధాలు ఒడుదొడుకులకు గురవుతున్న వేళ ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఢిల్లీలోని ఎంబసీ  కార్యాలయ సిబ్బందితో తాజాగా  తొలిసారిగా సెర్గియో మాట్లాడారు. డిప్లమసీకి సరికొత్త నిర్వచనం ఇవ్వడానికి మీకూ నాకూ ఒకేసారి అవకాశం లభిస్తోంది. కలిసి పనిచేసి ఈ శతాబ్దానికే కీలకమైన ఓ భాగస్వామ్యాన్ని నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ నిజమైన స్నేహితులని, ఆ అనుబంధమే రెండు దేశాల మధ్య నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్నేహితుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు సహజమేనని, చివరికి అవి సమసిపోతాయని సెర్గియో స్పష్టం చేశారు.  భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే సెట్ అవుతుందని ఆ దిశగా చర్చలు సాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది లేదా ఆపై ఏడాది ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కీలక మినరల్స్ ,ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పై సహకారానికి అమెరికా నేతృత్వంలో ప్రారంభమైన వ్యూహాత్మక కూటమి పాక్స్ సిలికాలో చేరాలని సెర్గియో గోర్ భారత్ ను  ఆహ్వానించారు. వచ్చేనెలలో ప్రభుత్వానికి అధికారికంగా ఆహ్వానం అందుతుందన్నారు.