భారత్ బియ్యం ఉత్పత్తిలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు నెంబర్ వన్ గా కొనసాగుతున్న చైనాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గణాంకాలను వెల్లడించారు. భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తిని సాధించగా, చైనా 145.28 మిలియన్ టన్నులకే పరిమితమైందని తెలిపారు.
ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) అభివృద్ధి చేసిన 25 రకాల పంటలకు చెందిన 184 కొత్త వంగడాలను మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విడుదల చేశారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్ సాధించిన ప్రగతి వల్లే నేడు ప్రపంచ మార్కెట్లకు బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందన్నారు. ఈ కొత్త వంగడాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
దేశాన్ని ఆహార రంగంలో సంపూర్ణ స్వయం సమృద్ధిగా మార్చేందుకు పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిపై మరింత దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని గత 11 ఏళ్ల కాలంలో 3,236 అధిక దిగుబడినిచ్చే వంగడాలకు ఆమోదం తెలిపినట్లు ఆయన గుర్తుచేశారు. వాతావరణ మార్పులు, కరవు, నేలల లవణీయత వంటి విపత్కర పరిస్థితులను తట్టుకునేలా ఈ నూతన విత్తనాలను రూపొందించినట్లు వివరించారు.
ఒకప్పుడు ఆహార కొరతతో ఇబ్బంది పడ్డ భారత్, నేడు ప్రపంచ దేశాలకే వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదగడం పట్ల చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విత్తన సంస్థల సమిష్టి కృషితోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు.