అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్ లో మమత బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో చొరబాట్లు కేవలం బెంగాల్ కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని యావత్ దేశానికి సంబంధించిన సమస్యని అన్నారు. వీటివల్ల మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయని అన్నారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను అడ్డుకుంటామన్నారు. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని స్పష్టం చేశారు. మమత బెనర్జీ పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి మందగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తామని భరోసానిచ్చారు.