వింగ్స్ ఇండియా వేదికగా విధాన నిర్ణయకర్తలు, పరిశ్రమ నాయకులు, ఆవిష్కరణ కర్తలు ఒకే దిశగా కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తూ భారత విమానయాన రంగ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్నారని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వింగ్స్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో భాగస్వామిగా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారత పౌర విమానయాన రంగాన్ని ఆవిష్కరణలు, సామర్థ్యం, భద్రత, సేవల పట్ల నిబద్ధతతో ముందుకు నడిపిస్తున్న ఎయిర్‌లైన్స్, విమానాశ్రయాలు, కార్గో ఆపరేటర్లు, MROలు, స్టార్టప్‌లు, నిపుణుల కృషికి ఈ అవార్డులు గౌరవ సూచకమని అన్నారు. అవార్డులు అందుకున్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వీరి విజయాలు కొత్త ప్రమాణాలను నెలకొల్పి, తదుపరి అభివృద్ధి దిశకు ప్రేరణగా నిలుస్తాయని భారత గగనతలాన్ని మరింత సురక్షితంగా, శక్తివంతంగా, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. భారత విమానయాన వృద్ధి ఇక సంఖ్యలకే పరిమితం కాదు, సమగ్ర, బలమైన, భవిష్యత్‌కు సిద్ధమైన వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రాంతీయ కనెక్టివిటీ నుంచి గ్లోబల్ భాగస్వామ్యాల వరకు భారత విమానయానం కీలక మార్పు దశలోకి అడుగుపెట్టిందన్నారు.