భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ రేపు తిరువనంతపురం వేదికగా జరగనుంది. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు తిరువనంతపురంలోని చారిత్రక శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరగనున్న సిరీస్ లోని ఆఖరి మ్యాచ్‌కు ముందు వారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్-రౌండర్ అక్షర్ పటేల్, బ్యాటర్ రింకు సింగ్, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వెళ్లారు. ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన నాలుగో మ్యాచ్ కు ముందు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని టీమిండియా క్రికెటర్లు దర్శించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, నాలుగో మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని భారత జట్టు భావిస్తోంది. ఫిబ్రవరి 7 నుండి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‌ను అమెరికాతో ఆడనుంది.