విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన హైదరాబాద్ యువ క్రికెటర్ అమన్

Spread the love

హైదరాబాద్ యువ బ్యాటర్ అమన్ రావ్ పేరాల విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాటింగ్ తో అలరించాడు. తాజాగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌ లో చెలరేగి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.  నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన 21 ఏళ్ల అమన్, తొలి 10 బంతుల్లో 3 పరుగులే చేశాడు. ఓపెనర్ రాహుల్ సింగ్‌ తో కలిసి కీలక పార్టనర్షిప్ నెలకొల్పాడు.  65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను, 107 బంతుల్లో తన తొలి లిస్ట్ ఏ సెంచరీ అందుకున్నాడు. ఇక ఆ  తర్వాత 150 పరుగుల మార్కును 134 బంతుల్లో దాటాడు.  మరో 20 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.  అతని ఇన్నింగ్స్‌లో 12×4, 13×6 భారీ సిక్సర్లు ఉన్నాయి.ఈ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది కేవలం తొమ్మిదో డబుల్ సెంచరీ కాగా, లిస్ట్ ఏ ఫార్మాట్‌ లో డబుల్ సెంచరీ సాధించిన 15వ భారత బ్యాటర్‌గా అమన్ రికార్డు సృష్టించాడు. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో అమన్‌ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది.