మహారాష్ట్ర డిప్యూటీ సీఎం నేడు జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో పవార్ (66)తో పాటు మరో నలుగురు మరణించారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.విమానా ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది.విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. అజిత్ పవార్, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
అజిత్ పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు.అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఉన్నారు.1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి సర్కార్ లో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు.