వైభవంగా మేడారం మహాజాతర..భారీగా సందర్శిస్తున్న భక్తులు

Spread the love

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారం మహా జాతర  2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. జనవరి 28 – గద్దెలపై సారలమ్మ రాక,జనవరి 29 – గద్దెలపై సమ్మక్క రాక, జనవరి 30 – భక్తుల మొక్కులు,జనవరి 31 – దేవతల వనప్రవేశం వంటి ఘట్టాలు ఉంటాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గిరిజన ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, నలుదిశలా తోరణాలను నిర్మించడమే కాకుండా, లక్షలాదిగా నిరంతరం మేడారానికి తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాల పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని అన్నారు.నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి ఫోన్‌లో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి  ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉంటూ మహాజాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.