రానున్న బడ్జెట్ సమావేశాల నుంచి పార్లమెంట్ లో 22 భాషల అనువాదాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీంతో పార్లమెంటు సభ్యులంతా తమ మాతృ భాషల్లో మాట్లాడేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ఒక సరికొత్త చరిత్రగా నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు భారత్ పార్లమెంటు ‘కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ కామన్వెల్త్-2026’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ ప్రోగ్రామ్స్ వెల్లడి కోసం తాజాగా పార్లమెంటు అనుబంధ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓం బిర్లా మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ కు 42 దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నట్లు తెలిపారు. బడ్జెట్ సెషన్స్ లో భారతీయ భాషలన్నింటిలో అనువాద ప్రక్రియ మొదలు పెట్టి, ఆ తర్వాతి సమావేశాల్లో ఏఐ ఆధారంగా పార్లమెంటు డాక్యుమెంట్స్ ఎంపీలకు 22 భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10 భాషల్లో ఈ ఎక్సరసైజ్ పూర్తయిందని, త్వరలో మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. డిజిటల్ సంసద్ యాప్ ద్వారా ఈసారి అన్ని రాష్ట్రాల బడ్జెట్ డాక్యుమెంట్స్ ఒకే వేదికపై అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీలు తమ సొంత భాషలో భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా తమ నియోజకవర్గ సమస్యలను మరింత సమర్థవంతంగా వివరించగలరు. దేశంలోని సామాన్య ప్రజలు కూడా పార్లమెంటులో తమ భాషలో జరుగుతున్న చర్చలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.పార్లమెంటు దస్త్రాలు, బడ్జెట్ ప్రతులు మరియు ఇతర రికార్డులను కూడా ఈ 22 భాషల్లో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.