మాజీ ఇండియన్ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ బుక్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ బుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై ఇప్పటికే కేసు నమోదైన విషయం విదితమే . కాగా, ఈ క్రమంలోనే పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. ఆ బుక్ ఒక్క కాపీ కూడా ఇంకా పబ్లిష్ కాలేదని తెలిపింది. అనఫీషియల్ కాపీలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని తెలిపింది. “నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ పబ్లిషింగ్ రైట్స్ కేవలం మాకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ బుక్ ను ఇప్పటివరకు మేం ప్రింట్ చేయలేదు. డిజిటల్ ఫార్మాట్లోనూ అందుబాటులో లేదు. దీన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు. ప్రస్తుతం ఈ బుక్ ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపంలో పంపిణీలో ఉంటేమాత్రం అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని వాటిని వెంటనేస్వాధీనం చేసుకుని దానిపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నామని పెంగ్విన్ స్పష్టం చేసింది. ఈ పుస్తకం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్, ఆన్లైన్ వార్తాసంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రచురణకు ముందు రూపొందించిన పీడీఎఫ్ కాపీ కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉందని తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పెంగ్విన్ సంస్థ దీనిపై క్లారిటీనిచ్చింది. ఇక నరవణె రాసిన ఈ బుక్ ను ఇటీవల లోక్ సభ లోకి రాహుల్ గాంధీ తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.