అదరగొట్టిన సన్ రైజర్స్..పంజాబ్‌పై గెలుపుతో నంబర్ 1 ప్లేస్‌

Spread the love

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ స్థానంలోకి దూసుకెళ్లింది. తాజాగా జరిగిన హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 33 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్  ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ 35 (13 బంతుల్లో 2×4, 4×6),, ట్రావిస్ హెడ్ 38 (19; 3×4, 3×6), ఇషాన్ కిషన్ 55 (32; 2×4, 4×6), హెన్రిచ్ క్లాసిన్ 69 (43; 3×4, 4×6),నితీష్ కుమార్ రెడ్డి 29 నాటౌట్ (13; 2×4, 2×6) పరుగులతో ఆకట్టుకున్నారు. 

పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్, ఫెర్గుసన్, చాహల్, విజయ్ కుమార్ వైషాక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బౌలింగ్ లో బాగా పరుగులు ఇచ్చారు. చాహల్ మినహా మార్కో జాన్సెన్,  అర్ష్ దీప్, ఫెర్గుసన్, వైషాక్ లు 10కి పైగా ఎకానమితో పరుగులు ఇచ్చారు. జాన్సెన్ 4 ఓవర్లలో 15 ఎకానమితో 61 పరుగులు ఇచ్చి కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేదు. 

అనంతరం టార్గెట్ ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 202 పరుగులకే పరిమితమైంది. కూపర్ కన్నోలి 107 నాటౌట్ (59; 7×4, 8×6) ఒక్కడే సెంచరీతో చెలరేగాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నప్పటికీ పంజాబ్ పరుగులను పెంచుతూ బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు క్రీజులో నిలిచి పోరాడాడు. మార్కస్ స్టోయినీస్ (28), సూర్యంష్ షెడ్జ్ (25) పర్వాలేదనిపించారు. శ్రేయాస్ అయ్యర్ (5), ప్రియాంశు (1), ప్రభ్ సిమ్రన్ సింగ్ (3), శశాంక్ సింగ్ (4) నిరాశపరిచారు.  

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించింది. గత ఓటమిలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా సమిష్టిగా పోరాడి సత్తా చాటింది. బ్యాటింగ్ బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థి కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, శివాంగ్ కుమార్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి, ఈషాన్ మలింగా, సాకిబ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.ఇక ఈ మ్యాచ్ విజయంతో ఆడిన 11 మ్యాచ్ లలో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *