ఈవీఎం వైపే ప్రజల మొగ్గు..రాహుల్ పై బీజేపీ విమర్శలు

Spread the love

ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటినుంచో  అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కర్ణాటకలో చేపట్టిన ఓ ప్రభుత్వ సర్వే ఫలితాలు ఆసక్తికర అంశాన్ని తెరపైకి తెచ్చాయి.  ఆ సర్వేలో రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు ఈవీఎంలను విశ్వసిస్తున్నట్లు తేలింది. దీంతో రాహుల్ గాంధీ పై బీజేపీ తన  విమర్శలకు మరింత పదును పెట్టింది. 

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ కేఎంఈఏ (కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ) గతేడాది ఆగస్టులో సర్వే నిర్వహించింది. ఆ నివేదికను  తాజాగా విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈవీఎంలు నమ్మగలిగినవేనని 83.61శాతం మంది వెల్లడించినట్లు తేలింది. ఇక, ఈ మెషీన్స్  కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు స్వేచ్చగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వేలో 102 అసెంబ్లీ నియోజవర్గాలకు చెందిన దాదాపు 5,100 మంది పాల్గొన్నారు. బెంగళూరు, బెళగావి, కల్బుర్గి, మైసూరు డివిజన్లలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలను సర్వే చేసి ఈ నివేదిక తయారుచేశారు.