నేడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా, ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత విదేశీ విధానం సాధించిన విజయాలను మరియు దాని దార్శనికతను వివరించారు. ఇందుకు సంబంధించి ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలను కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్లిష్ట సమయాల్లో ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం ఒక వారధిగా కీలక పాత్ర పోషిస్తోంది. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) స్వరాన్ని భారతదేశం బలోపేతం చేసింది. సంక్షోభ సమయాల్లో, ముఖ్యంగా పొరుగు దేశాలకు అండగా నిలవడంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందుంటోంది. పలు అంతర్జాతీయ సంస్థలలో భారతదేశం కీలకమైన బాధ్యతలను భుజానికెత్తుకుంటోంది. 2026లో BRICS అధ్యక్ష పదవిని చేపట్టడంతో పాటు, గ్లోబల్ AI ఇంపాక్ట్ సమ్మిట్‌ను (Global AI Impact Summit) భారత్ నిర్వహించనుందనే విషయాలను ఆమె వివరించిన వ్యాఖ్యలను ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.