భారత్-ఈయూ డీల్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Spread the love

భారత్, యూరోపియన్ యూనియన్ ల మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్  (FTA)పై ప్రధాని నరేంద్ర మోడీ  కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా  అభివర్ణించారు. ఈ ఒప్పందం ఖరారైతే ఇరు ఆర్థిక వ్యవస్థల మధ్య మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లకు భారీ ఊతం లభిస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ ఎనర్జీ వీక్ సదస్సులో వర్చువల్‌గా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఈ ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదరబోతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా మాట్లాడుకుంటున్నాయి. ఈ డీల్ 140 కోట్ల మంది భారతీయులకు, యూరప్‌లోని లక్షలాది ప్రజలకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ఈ ఒప్పందం ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు వాటా దీని  పరిధిలోకి వస్తుందని వివరించారు. ఈ డీల్ ద్వారా భారత్‌ లోని టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యూవెలరీ, లెదర్ వస్తువుల వంటి రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.  ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికే కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన వంటి ఉమ్మడి విలువల పట్ల నిబద్ధతను కూడా బలపరుస్తుందనిప్రధాని  స్పష్టం చేశారు. భారత్-యూకే వాణిజ్య ఒప్పందానికి ఈ డీల్ అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ మరియు భారతదేశం మధ్య భాగస్వామ్యం, ఉమ్మడి విలువలు మరియు ఉన్నతమైన ఆశయాల ప్రాతిపదికన మరింత బలోపేతం కావాలని, ఈ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు.