భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో మన ప్రధాని మరో వరల్డ్ రికార్డు సృష్టించారు. 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మార్క్ ను దాటిన మొదటి ప్రపంచ నేతగా అరుదైన ఘనత కైవసం చేసుకున్నారు. 2014లో ఇన్‌స్టాగ్రామ్ లో చేరిన మోదీ అనతికాలంలోనే ఈ అరుదైన ఘనతను అందుకోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాధినేతలతో సరిచూసినా ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. ఇక రెండో స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (43.2 మిలియన్లు) నిలిచారు.
అంతేకాకుండా, తర్వాతి ఐదుగురు ప్రపంచ నేతల ఫాలోవర్ల సంఖ్యను కలిపినా కూడా మోదీ సంఖ్యను అందుకోలేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (14.4 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దేశీయంగా కూడా ఇతర రాజకీయ నాయకుల కంటే మోదీ చాలా ముందంజలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాదాపు 16.1 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 12.6 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లలో కూడా ప్రధాని మోదీ హవానే కనిపిస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ లో ఆయనకు 106.2 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 54 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.