టీ 20 వరల్డ్ కప్ కు భారత్ తో పాటు ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సెమీ ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. తాజాగా గ్రూప్-2 మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (47), రచిన్ రవీంద్ర (32), కోల్ (31), ఫిన్ అలెన్ (23) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ 3 వికెట్లు, దుష్మంత్ చమీర 3 వికెట్లు, దునిత్ వెల్లలాగే 1 వికెట్ పడగొట్టారు. అనంతరం టార్గెట్ ఛేజింగ్ లో శ్రీలంక బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కమిందు మెండీస్ (31), వెల్లలాగే (29) మినహా ఎవరూ పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. హెన్రీ 2 వికెట్లు, సాంట్నర్ 1 వికెట్, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు. ఆడిన రెండు మ్యాచ్ లలో ఓటమితో సెమీస్ కు శ్రీలంక దూరం కాగా, లంకపై భారీ గెలుపుతో న్యూజిలాండ్ సెమీస్ కు చేరువైంది.