మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో కలుషిత నీరు కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు డబుల్ ఇంజిన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా కుంభకర్ణుడిలా నిద్రపోతోందని రాహుల్ ఫైర్ అయ్యారు. కలుషిత నీరు తాగడం వల్ల చాలా మంది ఇళ్లలో విషాదం నెలకొందని.. పేదలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు ఇవ్వకుండా.. అహంకారంతో వ్యవహరిస్తున్నారని బీజేపీ పై విమర్శలు గుప్పించారు. ‘మురికిగా, దుర్వాసన వస్తోన్న నీటి గురించి గతంలో ప్రజలు పదే పదే కంప్లైంట్ చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? తాగే నీటిలో మురుగునీరు ఎలా కలిసింది? వెంటనే నీటి సరఫరా ఎందుకు ఆపలేదు? బాధ్యులైన అధికారులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించారు. పరిశుభ్రమైన నీరు పొందడం ప్రజల జీవించే హక్కు అని అన్నారు. ఈ హక్కును కాలరాసినబీజేపీ ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. దుష్పరిపాలనకు మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. దగ్గు మందు కారణంగా, ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకల వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇప్పుడు కలుషిత నీరు కారణంగా మృతి చెందుతున్నారన్నారు. ఇలా పేదలు మరణించినా ప్రధాని మోదీజీ మాత్రం మౌనంగానే ఉంటారని దుయ్యబట్టారు.