భారతదేశం మరియు కొరియా దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనే లక్ష్యంతో కీలక చర్చలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ మరియు రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జే-మ్యూంగ్ దేశ రాజధాని న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్ కు వచ్చారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించారు. వాణిజ్యం, ఆర్థిక సేవలు, షిప్ బిల్డింగ్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంధనం, సెమీకండక్టర్లు, కీలకమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ మరియు భద్రత వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చించారు. ప్రజల మధ్య సంబంధాలు మరియు సాంస్కృతిక మార్పిడిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సుస్థిరతపై ఇరుదేశాల ఉమ్మడి నిబద్ధతకు చిహ్నంగా, ప్రెసిడెంట్ లీ “ఏక్ పెడ్ మా కే నామ్” చొరవ కింద ఒక మొక్కను కూడా నాటారు. చర్చల అనంతరం, ఇరు దేశాల నేతల సమక్షంలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్యం, నౌకా నిర్మాణం మరియు సముద్ర రంగం, డిజిటల్ రంగం మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్, విద్య, సంస్కృతి, క్రీడలు మరియు ప్రజల మధ్య సంబంధాలు వంటివి ఉన్నాయి. ఈ ఫలితాలు రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని, అలాగే ఇరు దేశాల ప్రజలకు మరియు పరిశ్రమలకు మరిన్ని కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.