కేరళలో మార్పు తథ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుజరాత్ లో బీజేపీ గెలుపు ఒక నగరం నుంచే మొదలైందని ఇదే కేరళలో కూడా పునరావృతమవుతుందని పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురంలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్.డి.ఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూ.డి.ఎఫ్)ల అవినీతిని అంతం చేస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో పరిస్థితులు మారతాయన్నారు. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలు రెండు వైపుల మాత్రమే చూశారని అవి రాష్ట్రాన్ని నాశనం చేసాయని అయితే మూడో వైపు ఒకటుందని అదే బీజేపీ అని అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుందని అన్నారు. ఎల్.డి.ఎఫ్, యూ.డి.ఎఫ్ ల జెండాలు వేరైనా వారి ఎజెండా ఒకటేనని అన్నారు. ఇప్పుడు అభివృద్ధికి దోహదం చేసే ప్రభుత్వం అవసరమని ఆ పని తాము చేస్తామని తెలిపారు. కేరళ ప్రజలు బీజేపీకి అండగా నిలవాలని కోరారు. ఇక ఈ సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగిన బంగారం చోరీ ఘటనపై స్పందించారు. దానిపైన విచారణ జరిగేలా చూడడం ‘మోడీ గ్యారంటీ’ అని స్పష్టం చేశారు.