బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-బ్రెజిల్ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు మించి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI), AI, సెమీకండక్టర్లు వంటి రంగాలలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని వివరించారు. ఇది ఇరు దేశాల ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇంధనం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, విద్య, రక్షణ మరియు బహుళపక్ష అంశాలలో కలిసి ముందుకుసాగానున్నాయి. భారత్ కు లాటిన్ అమెరికాలో అతిపెద్ద భాగస్వామిగా బ్రెజిల్ ఉందన్నారు. రెండు దేశాలది విన్-విన్ భాగస్వామ్యంగా అభివర్ణించారు. లూలా నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
భారతదేశం మరియు బ్రెజిల్ మధ్య సంబంధాలు కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలకే పరిమితం కాకుండా, వ్యూహాత్మకంగా పటిష్టంగా ఉన్నాయి. BRICS, G20 మరియు IBSA వంటి అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా నిలుస్తున్నాయి. తాజాగా రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20 బిలియన్లకు పైగా పెంచాలనే లక్ష్యంతో పాటు, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన రంగాలలో కలిసి పనిచేయడం ఇరు దేశాల ఆర్థిక వృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి బాటలు వేయనుంది.