దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత..ఆయిల్ కొనుగోలు అంశంపై మరోసారి స్పష్టత

Spread the love

రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ ఒప్పుకున్నట్లు  ఇటీవల అమెరికా ప్రెసిడెంట్  డొనాల్డ్ ట్రంప్  భారత్‌ పై టారిఫ్ లను తగ్గించామని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఈ అంశాన్నీ తెలిపిన విషయం విదితమే. కాగా,. తమ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని ప్రకటించిన నేపథ్యంలో  భారత్- రష్యా ఆయిల్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ మొదటి సారిగా స్పందించింది. ఇంధన రంగంలో ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తాము 140 కోట్ల మంది దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, ఆయిల్  కొనుగోళ్లపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని చాలా సార్లు స్పష్టం చేసింది. 140 కోట్ల మంది భారత ప్రజల ఇంధన భద్రతను కాపాడటానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వివిధ దేశాల నుండి  ఇంధన దిగుమతులను కొనసాగించే వ్యూహాన్ని భారత్ అనుసరిస్తోందని  భారత్ ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలు, ఇకపై తీసుకునే నిర్ణయాలు కూడా ఇదే విధంగా ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక ఇది వరకు చేసిన ప్రకటనలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేయడంతో పాటు వెనెజువెలా, అమెరికాల నుంచి ముడి చమురు దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై కూడా రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. వెనెజువెలాతో ఎంతో కాలంగా భారత్‌కు వాణిజ్య భాగస్వామ్యం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వెనెజువెలా చమురు కొనుగోలుకు తాము సుముఖంగానే ఉన్నామన్నారు. దీంతో పాటు వాణిజ్య పరంగా అవకాశం ఉన్న అన్ని చోట్ల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేశారు.