ఆంధ్రప్రదేశ్‌లో, NH-65 మరియు NH-216 జంక్షన్ నుండి మచిలీపట్నం పోర్టును కలుపుతూ, NH-216 మచిలీపట్నం బైపాస్ మీదుగా 6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి ₹573.77 కోట్ల కేటాయింపును ఆమోదించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మచిలీపట్నం పోర్ట్ మరియు జాతీయ రహదారి కారిడార్ మధ్య ప్రత్యక్ష మరియు అంతరాయం లేని అనుసంధానాన్ని అందిస్తుంది. ఇది సరుకు రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీని నివారించి, మొత్తం లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు. ఈ ఆమోదిత ప్రాజెక్టులో 6-లేన్ల మెయిన్ క్యారేజ్‌వే, సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు మరియు ఒక ఓవర్‌పాస్-కమ్-రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ (ROB) ఉన్నాయని ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. కాగా, ఈ పోస్ట్ కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను మెరుగుపరచడంలో అందిస్తున్న నిరంతర మద్దతుకు గడ్కరీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు, అభివృద్ధి దశలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. మచిలీపట్నం పోర్టుకు నిర్మిస్తున్న ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్, హింటర్ల్యాండ్ పోర్టుతో అనుసంధానించడంలో మరియు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంలో చాలా కీలకం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల పనులను వేగంగా పూర్తి చేయడానికి మా వైపు నుండి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.