డీలిమిటేషన్ లో ఆ యాంగిల్…పలువురు నేతల్లో అదే ఆందోళన

Spread the love

కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన దిశగా అడుగులు వేస్తుండటంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల  రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి ఏకంగా 263 కి పెరిగే అవకాశం ఉంది.  అలాగే ఎంపీ సీట్లు కూడా 38 వరకు చేరుకోవచ్చు. సంఖ్యాపరంగా ఇది పెరగడం అన్ని పార్టీలకు మంచిదే. రాజకీయ అసంతృప్తులకు కొంతవరకు చెక్ పెట్టొచ్చు. అంటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి ఒకే నియోజకవర్గంలో పోటీ ఉన్నప్పుడు అసంతృప్తి చెలరేగకుండా సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఇక భౌగోళికంగా సరిహద్దులు మారడం రాజకీయ పార్టీల భవిష్యత్తుకు కీలకం కానుంది. సాధారణంగా డీలిమిటేషన్ ప్రక్రియలో అధికారంలో ఉన్న పార్టీల అభిప్రాయానికి, అభీష్టానికి ప్రాధాన్యత ఉంటుంది. గతంలో అప్పటి అధికార పార్టీ హయాంలో జరిగిన పునర్విభజనలో అప్పటి ప్రతిపక్ష పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని  నియోజకవర్గాల్లో మార్పులు చేయడం వల్ల కొందరి నేతలు  రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు నేతలు ఆనాడు డీలిమిటేషన్ దెబ్బకు ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు సరిగ్గా అదే సీన్ రిపీట్ అవుతుందని ఇప్పటి ప్రతిపక్ష నేతలు కొందరు వణికిపోతున్నారు. అప్పుడు చేసిన పని ఇప్పుడు అధికార పక్షం చేస్తే ఏమిటనేది వారి  ప్రధాన ఆందోళన. కేవలం సరిహద్దులు మార్చడమే కాదు.. సామాజిక సమీకరణాలను మార్చడం ద్వారా ప్రత్యర్థిని దెబ్బతీయడం ఇందులో ప్రధాన వ్యూహం. ప్రతిపక్షానికి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను ముక్కలు చేయడం ద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకును బలహీనపరచవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు ,  ఎస్సీ/ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల కేటాయింపు ఇక్కడ కీలకం కాబోతోంది. రాజకీయ చదరంగంలో ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు  నేతలు వేసే వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నియోజకవర్గాల విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరుగుతుందా లేక రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, రాబోయే డీలిమిటేషన్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతోందన్న వాదన వినిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *