నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం..మన వారసత్వం మన నాగరికత యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది మరియు తరతరాల జ్ఞానాన్నిముందుకు తీసుకువెళుతోంది. ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక సంపద నుండి మన దేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం వరకు, వారసత్వాన్ని కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే.ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా కనువిందు చేసే ‘కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్- 2026’
నేటి నుంచి మూడు రోజులు చారిత్రక కొండపల్లి కోట వద్ద జరుగుతున్న వేడుకలు సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే కొండపల్లి బొమ్మలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కొండపల్లి బొమ్మ వెనుక ఎంతో కష్టం, నైపుణ్యం దాగి ఉంది. కేవలం ఒక బొమ్మగా కాకుండా, మన వారసత్వ సంపదగా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఈ వేడుకల సందర్భంగా షాపుల వద్ద పర్యాటకుల సందడి భారీగానే ఉంది. కొండపల్లి బొమ్మలతో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన హస్తకళల ప్రాముఖ్యత, కళాకారులు ఎదుర్కుంటున్న సమస్యలు, ఆ కళలను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వాలు కూడా తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. చేతివృత్తుల మూలాలు, బొమ్మలు, నాలుగు శతాబ్దా చరిత్రపై చర్చ, లైవ్లో బొమ్మలు చెక్కే ప్రదర్శన, రంగోలి పోటీలు, గ్రామ వీధుల సుందరీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం, కీలు బొమ్మలు, తోలుబొమ్మల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే బొమ్మల దర్బార్ బొమ్మల ప్రదర్శన, బొమ్మల కొలువు సందర్శకులను అలరిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల నుండి విదేశాల వరకు ఈ బొమ్మలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అందుకే ఈ బొమ్మలు తరతరాలుగా కొండపల్లి కీర్తిని ఖండాంతరాలు దాటించి మన కళాకారుల ప్రతిభకు మంచి గుర్తింపు తెస్తున్నాయి. ఈ మూడు రోజుల వేడుకల్లో ఎన్నో కార్యక్రమాలు అలరించనున్నాయి. మన వారసత్వాన్ని గౌరవిద్దాం.. మన కళాకారులను ప్రోత్సహిద్దాం. మీరు కూడా వీలు చూసుకుని ఈ మూడు రోజుల్లో ఒకసారి కొండపల్లిని చూసి రండి.