మళ్లీ ట్రోల్స్ కు పని చెప్పిన పాక్ క్రికెట్ టీమ్

Spread the love

ఒకప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల క్రీడాభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులలో ఒక మంచి రసవత్తర వాతావరణం కనిపించేది. అందులోనూ వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే యుద్ధంలో తలపడుతున్న విధంగా ఉత్కంఠ నెలకొని ఉండేది. అప్పటి జట్లు కూడా అదే రేంజ్ లో హోరాహోరీగా సమఉజ్జీలుగా  ఉండేవి. భారత్ దే వరల్డ్ కప్ లో పైచేయి అయినా పాకిస్థాన్ కూడా గట్టి పోటీ ఇచ్చేది. అయితే గత కొంత కాలంగా ఇది సన్నగిల్లుతూ వస్తోంది. ముఖ్యంగా రెండు జట్ల వైపు నుండి దిగ్గజ క్రికెటర్ల నిష్క్రమణ కూడా దీనికి ఒక కారణం కావొచ్చు. అయితే భారత్ వైపు నుండి క్వాలిటీ క్రికెట్ కొనసాగుతోంది. కానీ పాకిస్థాన్ పరిస్థితి మాత్రం దిగజారి కనిపిస్తోంది. అలాగే పాక్ క్రికెటర్లపై ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. 

ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి పరిశీలిస్తే వసీమ్ అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్, ఇంజమాముల్ హాక్, షోయబ్ అక్తర్, షాహీద్ అఫ్రిదిల తరంలో పాకిస్థాన్ అలాగే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, జవగళ్ శ్రీనాథ్, మహేంద్ర సింగ్, ధోని, యువరాజ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ  ఇలా ప్రతి జెనరేషన్ లో హేమా హేమీలుగా ఉండేవాళ్లు. అప్పటి జట్లు ఆడుతుంటే వీధులన్నీ ఖాళీగా కనిపించిన ఘటనలు కూడా అనేకం. 1992, 1996, 1999, 2003, 2007,2011,2015,2019 వరకు పతాకస్థాయిలో భారత్-పాక్ క్రేజ్ కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతం భారత్-పాక్ మ్యాచ్ కు క్రేజ్ ఉన్నప్పటికీ అది ఒకప్పటిలా మాత్రం కాదనేది సగటు క్రికెట్ అభిమాని ఫీలవుతున్న వాస్తవం. ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్లలో పోటీ పడిన ప్రతిసారి భారత్ ఒక్క 2021లో మినహా అన్నింటిలో విజయం సాధించింది.

భారత్ కు పాకిస్థాన్ పై తిరుగులేని రికార్డు ఉంది. దానిని కొనసాగిస్తూ నిన్న కొలొంబో వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌ లో మరోసారి పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఘనవిజయం క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో, సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ జట్టుపై వస్తున్న ట్రోల్స్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. భారత్ మరియు పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది కోట్ల మంది భావోద్వేగం. నిన్నటి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో అభిమానులు సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. అయితే, పాకిస్థాన్ ఆటగాళ్ల వైఫల్యంపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.పాకిస్థాన్ జట్టు ఓటమికి ప్రధాన కారణం వారి పేలవమైన ఫీల్డింగ్ అని చెప్పవచ్చు. క్యాచ్‌లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ చేయడం వంటి అంశాలను నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. గతంలో జరిగిన మ్యాచ్‌లలో కూడా పాక్ ఫీల్డింగ్ ఇలాగే ఉండేదని, వారు అస్సలు మారలేదని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇందుకే పాకిస్థాన్ భారత్ తో ఆడనంది అంటూ సెటైర్లు వేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ‘ఎక్స్’,’ఇన్‌స్టాగ్రామ్’ వంటి వేదికలు పాకిస్థాన్‌పై వస్తున్న మీమ్స్‌తో నిండిపోయాయి. పాకిస్థాన్ పై సృష్టించిన వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి. ట్రోలింగ్ ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు భారత బౌలర్ల ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. పాకిస్థాన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి చెమటలు పట్టించిన విధానం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. భారత జట్టు ముందు పాక్ నిలవలేదు అనే అర్థం వచ్చేలా పోస్ట్లు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ టోర్నీకి ముందు భారత్ తో తాము మ్యాచ్ ఆడమంటూ మొదట బింకాలు పలికి చివరికి ఆడేందుకు ఒప్పుకుని మ్యాచ్ కు ముందు భారత్ ను చిత్తు చేస్తామంటూ ప్రగల్బాలు పలికిన ఆ దేశ అభిమానుల అంచనాలను అదః పాతాళానికి తొక్కేసిన పాక్ తీరుపై ట్రోలింగ్ భారీగానే జరుగుతోంది. భారత్-పాక్ మ్యాచ్ అంటే పాకిస్థాన్ ప్రజలకు అది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక ప్రతిష్టాత్మక యుద్ధంలా భావిస్తారనేది తెలిసిందే. ఇక  మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా, కనీసం పోరాటం కూడా చేయకుండా చేతులెత్తేయడం పాకిస్థాన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తమ ఇంట్లోని టీవీలను పగలగొడుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. టీవీలు పగలగొట్టడం అనేది పాకిస్థాన్‌లో కొత్తేమీ కాదు. 1990ల నుండి ఇది జరుగుతూనే ఉంది. అయితే, ఈసారి నెటిజన్లు దీనిపై విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. టీవీ షోరూమ్ యజమానులకు ఇప్పుడు అక్కడ పండగ వచ్చి ఉంటుందని, మళ్ళీ టీవీ మెకానిక్‌లకు పని దొరికిందని సెటైర్లు పడుతున్నాయి. స్టేడియంలో పాకిస్థాన్ అభిమానుల నిరాశ చెందిన ముఖాలను కెమెరాలు బంధించాయి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, భారత్ గెలిచిన ప్రతిసారీ పాక్ పరిస్థితి ఇదేనని నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక అభిమానులు చేసే వింత చేష్టలు కూడా వైరల్ అవుతున్నాయి.ట్రోలింగ్ అనేది కేవలం వినోదం కోసమే అయినా, అది హద్దులు దాటకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, కానీ భారత్ సాధించిన ఈ విజయం మాత్రం చిరకాలం గుర్తుండిపోతుందని అభిమానులు మురిసిపోతున్నారు. ఏది ఏమైనా, పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఈ గెలుపు దేశవ్యాప్తంగా మరోసారి సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.