అమెరికా ట్రేడ్ డీల్ అంశంలో  కేంద్రప్రభుత్వంపై రాహుల్ ధ్వజం..ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు  

Spread the love

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళా మరోసారి రాహుల్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రైతులు ఈ వాణిజ్య ఒప్పందం వలన నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్రం దేశ వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీ పడేలా చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది తాత్కాలిక అంశం కాదని రైతుల భవిష్యత్తుకు సంబంధించిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ‘ఎక్స్’ వేదికగా రాహుల్ 5 ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ఈమేరకు తన ప్రశ్నలు సంధించారు. 

నేను ప్రధానమంత్రిని కొన్ని సులభమైన ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను:

DDG (డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రైన్స్ )దిగుమతి అంటే అసలు అర్థం ఏమిటి? భారతీయ పశువులకు అమెరికన్ GM (జెనెటికల్లీ మోడిఫైడ్) మొక్కజొన్నతో తయారు చేసిన ‘distillers grain’ తినిపిస్తారని దీని అర్థమా? దీనివల్ల మన పాల ఉత్పత్తులు ప్రభావవంతంగా అమెరికన్ వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడవు అని చెప్పగలరా?

మనం ఒకవేళ జెనెటికల్లీ మోడిఫైడ్ సోయా ఆయిల్ దిగుమతికి అనుమతిస్తే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న మన సోయా రైతుల పరిస్థితి ఏమవుతుంది? వారు మరోసారి ధరల షాక్‌ను ఎలా తట్టుకోగలరు?

మీరు “అదనపు ఉత్పత్తులు” (additional products) అన్నప్పుడు, అందులో ఏమేమి ఉన్నాయి? ఇది కాలక్రమేణా పప్పు ధాన్యాలు మరియు ఇతర పంటలను అమెరికన్ దిగుమతుల కోసం తలుపులు తెరవడమా?

“వాణిజ్యేతర అడ్డంకులు” (Non-trade barriers) తొలగించడం అంటే అర్థం ఏమిటి? భవిష్యత్తులో GM పంటలపై తన వైఖరిని సడలించాలని, సేకరణ (procurement) ప్రక్రియను బలహీనపరచాలని లేదా MSP మరియు బోనస్‌లను తగ్గించాలని భారత్‌పై ఒత్తిడి వస్తుందా?

ఒక్కసారి ఈ తలుపులు తెరుచుకుంటే, ప్రతి సంవత్సరం ఇది మరింత పెరగకుండా మనం ఎలా అడ్డుకోగలం? దీనికి ఏవైనా నివారణ చర్యలు ఉంటాయా, లేదా ప్రతిసారీ ఒప్పందంలో భాగంగా మరిన్ని పంటలను క్రమక్రమంగా పణంగా పెడతారా? అంటూ రాహుల్ తన ‘ఎక్స్’ పోస్ట్ లో పేర్కొన్నారు.