భారత్, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్-2026 నుండి బంగ్లాదేశ్ ను తప్పించినందుకు ఈ టోర్నీని బహిష్కరించాలని పాక్ భావిస్తున్నట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ దీనిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ కోసం ఆ జట్టు శ్రీలంకకు వెళ్లబోతోంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న పాక్ కొలంబోకు చేరనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అయితే పాక్ బెదిరింపులకు ఇటు బీసీసీఐ, అటు ఐసీసీ ఏమాత్రం తలొగ్గలేదు. ఆ జట్టుతో సంప్రదింపులు కూడా జరపలేదు. టోర్నీకి దూరమైతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని అర్థం చేసుకున్న పాక్ క్రికెట్ బోర్డు టీమ్ ను పంపడానికి సిద్ధమైంది. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా మిగతా దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని పాకిస్థాన్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 వరకు భారత్ లో జరిగే ఐసీసీ టోర్నీల్లో తమ మ్యాచ్లను పాక్ ప్రత్యామ్నాయ వేదికల్లో ఆడనుంది.