ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు విడుదల చేసింది. ఇంగ్లండ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12న ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జులై 5న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా భారత జట్టు తన మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనుంది. ఇటీవల నేపాల్‌లో ముగిసిన క్వాలిఫయర్ టోర్నీ ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. దీంతో టోర్నీలో పాల్గొనే 12 జట్ల లైనప్ ఖరారైంది. ఈ టోర్నీలో మొత్తం 12 టీమ్ లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ గ్రూప్-ఏలో ఉండగా..ఇక గ్రూప్-బిలో వెస్టిండీస్, ఇంగ్లండ్, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ టీమ్ లు ఉన్నాయి.